నేనోరకం మూవీ రివ్యూ

విడుదల తేదీ : మార్చి 17, 2017

దర్శకత్వం :సుదర్శన్ సాలేంద్ర

నిర్మాతలు :శ్రీకాంత్ రెడ్డి

సంగీతం :మహిత్ నారాయణ్

నటీనటులు :సాయి రామ్ శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్

టైమ్స్ ఆఫ్ ఏపి.కామ్ రేటింగ్ : 3/5

హీరో సాయి రామ్ శంకర్ వరుస పరాజయాల తర్వాత చేసిన చిత్రం ‘నేనోరకం’. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ ప్రమోషన్లతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

గౌతమ్ (సాయి రామ్ శంకర్) పండగ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. ఆ సమయంలో అతను స్వేచ్ఛ (రేష్మి మీనన్) ను చూసి ప్రేమలో పడతాడు. రకరకాల్ స్కీములు వేసి ఆమెను కూడా ఇంప్రెస్ చేసి తిరిగి ప్రేమించేలా చేస్తాడు.

అలా అతని లైఫ్ సెట్టైపోతోంది అనుకునే సమయంలో శరత్ కుమార్ అతని లైఫ్ లోకి ఎంటరై ఊహించని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాడు. అసలు శరత్ కుమార్ ఎవరు? అతను గౌతమ్ జీవితంలోకి ఎందుకొచ్చాడు ? ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేశాడు ? గౌతమ్ ఆ ఇబ్బందుల్ని అధిగమించాడా లేదా ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని బలమైన అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది సినిమా సెకండాఫ్ గురించి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో మొదలయ్యే సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శరత్ కుమార్ హీరో సాయి రామ్ శంకర్ ను కంటికి కనిపించకుండా ఒక ఆట ఆడుకోవడం బాగుంది. ఆ ఆటలో హీరో చేత శరత్ కుమార్ ను బెదిరించడం, అతన్ని పరిగెత్తించి పరిగెత్తించి టెంక్షన్ పెట్టడం, తాను అనుకున్నవన్నీ చేయించడం వంటి సన్నివేశాలు బాగా మెప్పించాయి. సెకండాఫ్ మొత్తాన్ని శరత్ కుమార్, హీరో సాయి రామ్ శంకర్ లు తమ పెర్ఫార్మెన్స్ తో సక్సెస్ ఫుల్ గా నడిపారు.

అలాగే ఎమోషనల్ గా ఉండే శరత్ కుమార్ గతం, అతను హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చాడనే సంగతి సినిమా ఆఖర్లో రివీల్ చేయడం కొత్తగా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్లో హీరోయిన్ రేష్మి మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా ఉంది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి హీరో చేసే కొన్ని పనులు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగున్నాయి. ఫస్టాఫ్లో పృథ్వి, లేట్ ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ కొన్ని చోట్ల మాత్రం పేలింది.

దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర సినిమాకు కీలకమైన సెకండాఫ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. సాయి రామ్ శంకర్, శరత్ కుమార్ పాత్రల మధ్య అతను నడిపిన డ్రామా సినిమాకే హైలెట్ గా నిలిచింది. సాయి రామ్ శంకర్ కూడా ఇదివరకటి సినిమాలకంటే ఇందులో మెరుగ్గా నటించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ఫస్టాఫ్ ప్రధాన బలహీనత. ఆరంభం నుండి ఇంటర్వెల్ ముందు వరకు హీరో హీరోయిన్ మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సీన్లు, కామెడీ సీన్లు మినహా మిగతా కథనం అంతా ఏదో సమయం గడపాలి కాబట్టి నడిపినట్టు ఉంది. ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ ఆరంభంలో బాగానే ఉన్న దాన్ని మోతాదుకు మించి సాగదీయడంతో ఒక దశలో చిరాకు కలిగింది.

ఇక సెకండాఫ్ ఆరంభమయ్యే వరకు సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో ఫస్టాఫ్ నీరసంగా తయారైంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఓకే గానీ మిగతా కథనమంతా ఎందుకు నడుస్తుంది, అసలు అవసరమా అనిపించింది. అలాగే కథనం కాస్త ఊపందుకునే సమయంలో వచ్చే పాటలు అడ్డు తగులుతున్నట్టు తోచాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పాయింట్ ను డిఫరెంట్ యాంగిల్ లో హ్యాండిల్ చేసి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ విషయంలో కాస్త విఫలమైనా సెకండాఫ్లో మాత్రం మ్యాగ్జిమమ్ మార్కులు దక్కించుకున్నాడు. సెకండాఫ్ లో నడిచే రేసీ సన్నివేశాల్లో కెమెరా వర్క్ రియలిస్టిక్ గా ఉండి ఆకట్టుకుంది.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ అందించిన ఆర్ఆర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ సమయంలో ఫస్టాఫ్లోని కొన్ని అనవసరమైన సీన్లను తొలగించి ఉండాల్సింది. శ్రీకాంత్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:>

ఈ ‘నేనోరకం’ చిత్రం సాయి రామ్ శంకర్ గత చిత్రాలతో పోల్చితే బెటర్ గా ఉండి అతనికి కావాల్సిన సక్సెస్ ను అందిస్తుందనడంలో సందేహం లేదు. సస్పెన్స్ తో కూడిన సెకండాఫ్ డ్రామా, శరత్ కుమార్, సాయి రామ్ శంకర్ ల నటన, హీరోయిన్ రేష్మి మీనను స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా చాలా వరుకు అనవసరమైన సన్నివేశాలతో నిండిన ఫస్టాఫ్ ఇందులో ప్రధాన బలహీనత. మొత్తం మీద కాస్త సాగదీసినట్టు ఉండే ఫస్టాఫ్ ను తట్టుకోగలిగితే మంచి స్టోరీ లైన్, సస్పెన్స్ డ్రామా కలిగిన ఈ చిత్రం తప్పక మెప్పిస్తుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top