చక్కెర నిల్వలపై పరిమితులు

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే రెండు నెలల్లో చక్కెర ధరలను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చక్కెర నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. చక్కెర ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో 2016-17 సీజన్‌లో ఉత్పత్తి 2.1 కోట్ల టన్నులకు తగ్గనున్నదని అంచనా. అంతక్రితం ఏడాది 2.5 కోట్ల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. ప్రతియేట భారత్‌లో చక్కెరకు డిమాండ్ 2.4-2.5 కోట్ల టన్నుల స్థాయిలో ఉంటుంది.

ధరలను నియంత్రించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చక్కెర నిల్వలపై పరిమితులు విధించినట్లు ట్విట్టర్ ద్వారా పాశ్వాన్ వెల్లడించారు. 2016-17 మార్కెటింగ్ సంవత్సరం(అక్టోబర్-సెప్టెంబర్ మధ్యకాలం)లో పంచదార మిల్లులు తాము ఉత్పత్తి చేసిన చక్కెరలో సెప్టెంబర్‌లో 21 శాతంకు మించి నిల్వ ఉంచరాదని, అలాగే అక్టోబర్ విషయానికి వస్తే 8 శాతం మించి ఉంచరాదని ఆయన వెల్లడించారు. పండుగ సీజన్‌లో మిల్లు యజమానులు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో నిల్వలపై పరిమితులు విధించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.40 స్థాయిలో ఉండగా, బ్రాండెడ్ ధర రూ.50 స్థాయిలో ఉంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న చౌక ధర కలిగిన చక్కెరను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో దిగుమతి సుంకాన్ని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top