రెండు నెలల గరిష్ఠానికి సెన్సెక్స్

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు కార్పొరేట్ ఫలితాలు లాభాల్లో ప్రారంభమవడంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. 26,978.44 పాయింట్ల వద్ద ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ ఆరంభంలోనే 27 వేల మార్క్‌ను దాటింది. ఇంట్రాడేలో 27,174.87 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ మార్కెట్ ముగిసే సమయానికి 240.85 పాయింట్లు(0.90 శాతం) లాభపడి 27,140.41 వద్ద స్థిరపడింది.

నవంబర్ 10న నమోదైన 27,517.68 పాయింట్ల స్థాయికి చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 8,300 పాయింట్లు దాటింది. చివరకు 92.05 పాయింట్లు(1.11 శాతం) ఎగబాకి 8,380.65 వద్ద ముగిసింది. మూడో త్రైమాసికంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆశాజనక ఫలితాలను ప్రకటించడం, ఆసియా స్టాకులు పుంజుకోవడం, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తొలిసారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయనుండటం మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడ్డాయని మార్కెట్ పండితులు వెల్లడించారు. హెచ్1-బీ వీసాలకు సంబంధించిన బిల్లును ట్రంప్ మళ్లీ ప్రవేశపెట్టనుండటంతో ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మెటల్, బ్యాంక్స్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీ, పవర్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే గురువారం టీసీఎస్ , ఆ మరుసటి రోజు ఇన్ఫోసిస్ కూడా రిజల్ట్‌ను విడుదల చేయనుండటంలో మదుపర్లు వేచి చూసే దోరణి అవలంభించారు. కోల్ ఇండియా 5.41 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టీల్ 3.99 శాతం, లుపిన్ 2.20 శాతం, ఎల్ అండ్ టీ 1.91 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.79 శాతం, పవర్‌గ్రిడ్ 1.69 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.67 శాతం, ఎస్‌బీఐ 1.63 శాతం, సన్‌ఫార్మా 1.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.39 శాతం, మారుతి 1.35 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.32 శాతం, ఎన్‌టీపీసీ 1.23 శాతం, హెచ్‌యూఎల్ 1.23 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.03 శాతం చొప్పున లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, హీరోమోటోకార్ప్, టాటా మోటార్స్, అదానీపోర్ట్స్, సిప్లా, టీసీఎస్‌ల షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఆటో 0.85 శాతం తగ్గగా, ఐటీసీ, రిలయన్స్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్‌లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

డిసెంబర్ నాటికి 30,500కు సెన్సెక్స్: హెచ్‌ఎస్‌బీసీ

దేశీయ స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎస్‌బీసీ ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ఈ ఏడాది చివరినాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,500 పాయింట్లకు చేరుకోవచ్చునని అంచనావేస్తున్నది. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, వస్తు సేవా పన్ను(జీఎస్టీ) అమలులోకి రానుండటంతో దీర్ఘకాలికంగా వృద్ధికి ఊతం లభించనుండటంతో సూచీ బలపడానికి దోహదపడనున్నదని తెలిపింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top