రిలయన్స్ ఢమాల్.. సెన్సెక్స్ డీలా

లిస్టెడ్ కంపెనీల్లో పెద్దన్నగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా ఈవారం తొలి సెషన్‌లో స్టాక్ సూచీలు మరింత కిందికి జారుకున్నాయి. సెన్సెక్స్ 184 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 9,100 దిగువ స్థాయికి పడిపోయింది.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత దిద్దుబాటుకు లోనయ్యాయి. ఒకవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లపై అమ్మకాల ఒత్తిడి.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు.. అన్నీ వెరసి స్టాక్ సూచీలను కిందికి నెట్టాయి. సోమవారం మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ 184.25 పాయింట్లు (0.63 శాతం) కోల్పోయి 29,237.15 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 29,163.54 స్థాయికి పడిపోయినప్పటికీ మళ్లీ కాస్త కోలుకోగలిగింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే.. 62.80 పాయింట్లు (0.69 శాతం) నష్టపోయి 9,045.20 వద్దకు జారుకుంది. దాంతో సూచీ 9,100 మైలురాయి దిగువకు పడిపోయినైట్లెంది. దాదాపు పదేండ్లనాటి కేసుకు సంబంధించి ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై సెబీ ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేకాదు, దాదాపు రూ.1000 కోట్లు కట్టాలంటూ గత శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈవారం తొలి సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి కన్పించింది. ఇందుకుతోడు, గ్లోబల్ మార్కెట్లలోనూ ట్రేడింగ్ ట్రెండ్ బలహీనంగా మారింది. ఒబామా కేర్ స్థానంలో కొత్త హెల్త్‌కేర్ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చట్టసభల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ఆయన భవిష్యత్ పాలసీలపై అనిశ్చితి మబ్బులు కమ్ముకోవడం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత పెంచింది. ఆ ప్రభావం మన మార్కెట్లపైనా కన్పించింది. ప్రధాన షేర్లతోపాటు చిన్న, మధ్య స్థాయి స్టాకుల్లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో ఇరవై ఐదింటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. మిగతా 5 సంస్థల స్టాకులు లాభాలబాటలో పయనించాయి. టాటా స్టీల్ అత్యధికంగా 3.15 శాతం క్షీణించింది. రిలయన్స్ షేర్లు 2.76 శాతం నష్టపోయాయి. కోల్‌ఇండియా, ఏషియన్ పెయింట్స్ కూడా రెండు శాతంపైగా విలువను కోల్పోయాయి. విప్రో, సన్‌ఫార్మా, గెయిల్, ఓఎన్‌జీసీ, లుపిన్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్ షేర్లు ఒక శాతానికి పైగా తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 1.20 శాతం లాభపడి సెన్సెక్స్ టాప్ గైనర్లుగా నిలిచాయి. రంగాలవారీగా చూస్తే.. బీఎస్‌ఈలోని లోహ రంగ సూచీ 2.60 శాతం జారుకోగా.. ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ఐటీ సూచీలు కూడా నేలచూపులే చూశాయి.

రూ.12,488 కోట్లు తగ్గిన ఆర్‌ఐఎల్ విలువ

దాదాపు 3 శాతం మేర నష్టపోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.12,488 కోట్లు తగ్గి రూ.4,04,702.86 కోట్లకు పరిమితమైంది. ఎన్‌ఎస్‌ఈలో 2.77 శాతం నష్టపోయిన ఆర్‌ఐఎల్ షేర్ల ధర రూ.1,251.10 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 2.76 శాతం తగ్గి రూ.1,247.55 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో సంస్థకు చెందిన 8.88 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎస్‌ఈలో 74 లక్షల స్టాకులు చేతులు మారాయి.

ఏప్రిల్ 1న స్టాక్ ఎక్సేంజ్‌లలో మాక్ ట్రేడింగ్

ఈనెల ఒకటో తేదీన (శనివారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మాక్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. ట్రేడింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలతోపాటు సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించేందుకు ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్సేంజ్‌లు తెలిపాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్లలో మాక్ ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ వేర్వేరుగా మూడు సర్క్యులర్లు జారీ చేసింది.క్యాపిటల్ మార్కెట్, కరెన్సీ డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో మాక్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

రూపాయి మిలమిల

17 నెలల గరిష్ఠానికి దేశీయ కరెన్సీ విలువ

దేశీయ కరెన్సీ విలువ 17 నెలల గరిష్ఠ స్థాయికి పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు 37 పైసలు బలపడి 65.04 స్థాయి వద్ద స్థిరపడింది. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో బలపడటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతేకాదు, అక్టోబర్ 28, 2015న 64.93 వద్ద ముగింపును నమోదు చేసుకున్న డాలర్-రూపాయి ఎక్సేంజ్ రేటుకు ఆ తర్వాత మళ్లీ ఇదే అత్యంత మెరుగైన స్థాయి. కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు, ముఖ్యంగా కార్మిక, వ్యవసాయ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్దఎత్తున విధానపరమైన మార్పులు చేపట్టవచ్చన్న అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలహీనపడటం రూపాయి విలువ పెరుగడానికి ప్రధానంగా దోహదపడ్డాయి. ఈనెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో 600 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ మధ్యకాలంలో రూపాయి విలువ గణనీయంగా పెరుగడానికి ఈ పరిణామం కూడా తోడ్పడింది.

మార్కెట్ బాహుబలి

రూ.60 వేలకు చేరిన ఎంఆర్‌ఎఫ్ షేరు ధర

టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ షేర్ల ధర తొలిసారిగా రూ.60 వేల మైలురాయిని అధిగమించింది. సోమవారం ట్రేడింగ్‌లో రూ.59,250 వద్ద ప్రారంభమైన సంస్థ షేరు ధర మధ్యాహ్నం కల్లా రూ.60,140 స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో ట్రేడింగ్ ముగిసేసరికి ఎంఆర్‌ఎఫ్ స్టాకుల ధర 1.22 శాతం లాభంతో రూ.59,904.90 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఎంఆర్‌ఎఫ్ అత్యంత విలువైన షేర్లు. ఆ తర్వాత స్థానాల్లో ఐషర్ మోటార్ (రూ.24,168), బోష్ (రూ.22,812), శ్రీ సిమెంట్ (రూ.16,356), పేజ్ ఇండస్ట్రీస్ (రూ.14,701), 3ఎం ఇండియా (రూ.11,012) ఉన్నాయి. ఈ శతాబ్ద ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంఆర్‌ఎఫ్ షేరు ధర 4,759 శాతం లేదా దాదాపు 50 శాతం వృద్ధి చెందింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top