30వేలకు చేరువైన సెన్సెక్స్

ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతోపాటు ఆశాజనక నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కొనుగోళ్లు పుంజుకోవడంతో వరుసగా రెండో రోజు దూకుడు ప్రదర్శించాయి. దాంతో నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. తొలిసారిగా సూచీ 9,300 ఎగువ స్థాయిన ముగింపును నమోదు చేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ నిలిచిపోయేసరికి 88.65 పాయింట్ల (0.96 శాతం) లాభపడిన నిఫ్టీ 9,306.60 వద్ద స్థిరపడింది.

బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కూడా 30,000 మైలురాయికి చేరువలో ఉంది. సోమవారం నాడు 291 పాయింట్లు పెరిగిన సూచీ తాజా సెషన్‌లో మరో 287 పాయింట్లు పుంజుకొని 29,943.24 వద్ద ముగిసింది. ఈనెల 5న 29,974.24 వద్ద ముగిసిన సూచీ ఆ తర్వాత మళ్లీ ఇదే గరిష్ఠ ముగింపు స్థాయి. ప్రధాన షేర్లతోపాటు మధ్య, చిన్న స్థాయి షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ సూచీ 1.06 శాతం బలపడగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం పెరిగింది.

సెన్సెక్స్ 30లోని 24 కంపెనీల స్టాకులు లాభాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 3.40 శాతం చొప్పున పుంజుకొని టాప్‌గైనర్‌గా నిలిచాయి. భారతీఎయిర్‌టెల్ 3.18 శాతం, హీరో మోటోకార్ప్ 2.93 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.40 శాతం, హెచ్‌యూఎల్ 2.13 శాతం పెరిగాయి. ఐటీసీ, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక శాతానికి పైగా బలపడ్డాయి. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ అత్యధికంగా 0.76 శాతం నష్టపోయింది. సిప్లా 0.58 శాతం, గెయిల్ 0.39 శాతం, ఎన్‌టీపీసీ 0.30 శాతం తగ్గాయి. రంగాలవారీగా చూస్తే.. టెలికం సూచీ 2.62 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ 1.67 శాతం, రియల్టీ 1.26 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.23 శాతం, ఎనర్జీ 1.20 శాతం, ఫైనాన్స్ 1.18 శాతం, ఆటో 1.15 శాతం, బ్యాంకెక్స్ 1.03 శాతం పుంజుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా ప్రాంతానికి చెందిన చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల ప్రామాణిక స్టాక్ సూచీలు 0.16 శాతం నుంచి 1.31 శాతం మేర పెరిగాయి. యూరోపియన్ మార్కెట్లు సైతం లాభాల్లోనే కొనసాగాయి. గతసెషన్‌లో అమెరికా మార్కెట్లు సైతం మెరుగైన లాభాలు చవిచూశాయి.

మూడు వారాల గరిష్ఠానికి రూపాయి

దేశీయ కరెన్సీ విలువ మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు 18 పైసలు బలపడి 64.26 వద్ద స్థిరపడింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ విక్రయాలకు పాల్పడటంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ రూపాయి బలపడేందుకు తోడ్పడింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top