మొండిబకాయిలపై 'దివాలా' కొరడా

ముంబై: భారీగా మొండి బాకీలు పేరుకుపోయిన సంస్థలకు సంబంధించి ఆర్‌బీఐ బ్యాంకులకు పంపిన రెండో విడత లిస్టులో 26 సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట పథకాల ద్వారా ఈ సంస్థల నుంచి బకాయిలు రాబట్టేందుకు డిసెంబర్‌ 13 దాకా రిజర్వ్‌ బ్యాంక్‌ గడువు విధించింది. ఆలోగా పరిష్కారం కాకపోతే.. డిసెంబర్‌ 31లోగా ఆయా సంస్థలపై దివాలా చట్టం కింద (ఐబీసీ) నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను బ్యాంకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. బ్యాంకులకు రాసిన లేఖలో ఆర్‌బీఐ ఈ అంశాలు పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు రూ. లక్ష కోట్లు పైగా బాకీపడిన 26 కంపెనీల్లో భారీ స్థాయి కోవకి చెందినవాటిల్లో వీడియోకాన్‌ ఇండస్ట్రీస్, జేపీ అసోసియేట్స్‌ (జేఏఎల్‌) ఉన్నాయి.

తమ రుణ చెల్లింపు ప్రణాళికను రుణదాతల ఫోరం జూన్‌ 22న ఆమోదించిన నేపథ్యంలో తాజా జాబితాపై తాము స్పందించేందుకేమీ లేదని జేపీ గ్రూప్‌ చైర్మన్‌ మనోజ్‌ గౌర్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ లేఖలో పేర్కొన్నట్లుగా వస్తున్న వివరాలు వాస్తవమే అయిన పక్షంలో విషయం దివాలా చట్టం ప్రయోగించే దాకా వెళ్లకుండానే పరిష్కారాన్ని కనుగొనేలా ఇటు రుణదాతలకు, అటు రుణాలు తీసుకున్న సంస్థలను ప్రోత్సహించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రెండో విడత లిస్టులో 40 దాకా సంస్థలు ఉన్నాయని, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 కంపెనీలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో పేరుకుపోయిన మొండిబాకీలపై దృష్టి సారించిన ఆర్‌బీఐ.. టాప్‌ 500 భారీ ఖాతాల సమస్య పరిష్కారానికి 6 నెలల్లోగా తగు ప్రణాళిక రూపొందించాలంటూ బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ పరిష్కారం లభించకపోతే దివాలా చట్టం కింద చర్యలు తీసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించవచ్చని సూచించింది.

విద్యుదుత్పత్తి సంస్థలు .. టెల్కోలు..

ఆర్‌బీఐ మలివిడత లిస్టులో ప్రధానంగా విద్యుత్, టెలికం, ఉక్కు, ఇన్‌ఫ్రా సంస్థలు ఉన్నట్లు సమాచారం. లిస్టులోని సంస్థలు జూన్‌ 30 నాటికి చెల్లించాల్సిన బాకీల్లో సుమారు అరవై శాతం భాగాన్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించాయి. ఈ కోవకి చెందినవాటినే జాబితాలో పొందుపర్చడం జరిగింది. జూన్‌ ఆఖరు నాటికి బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తుల పరిమాణం 24% ఎగిసి రూ.7.79 లక్షల కోట్లకు చేరింది. వీటికి సంబంధించి తొలివిడతలో భారీగా బాకీపడిన 12 ఖాతాలను ఆర్‌బీఐ గుర్తించి.. తక్షణ చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top