రూ.8వేల కోట్లకు చేరిన అన్‌క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్లు

అన్‌క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్లు రూ.8వేల కోట్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఆ బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వ్యక్తులు లేదా వారసులకు సంబంధించిన వివరాలేవీ అధికారుల దగ్గర లేవు. కానీ బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లు మాత్రం రూ.8వేల కోట్లకు చేరినట్లు తేలింది. దీనికి సంబంధించిన తాజా నివేదికను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసింది. మొత్తం 2.63కోట్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలేమీ బ్యాంకు అధికారుల దగ్గర లేవు. కానీ వారి డిపాజిట్లు మాత్రం రూ.8,864.6కోట్లు ఉన్నాయి. 2012 నుంచి 2016 వరకు ఈ అప్రకటిత బ్యాంకు డిపాజిట్లలోని నగదు రెట్టింపయ్యింది. బ్యాంకుల్లో ఏళ్ల తరబడి డిపాజిట్లు చేసి.. వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం లేదా.. ఆ డిపాజిట్‌దారులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడంతో అవి అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లుగా మారిపోతాయి.

అప్రకటిత బ్యాంకు ఖాతాల సంఖ్య కూడా 2012లో 1.32కోట్లు ఉండగా.. 2016 నాటికి అది రెట్టింపై 2.63కోట్లగా చేరింది. అదే సమయంలో వారి డిపాజిట్లు కూడా రూ.3,598కోట్ల నుంచి రూ.8,864.6కోట్లకు చేరాయి. అన్‌క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్‌దారుల వివరాలను బ్యాంకు అధికారులు తమ తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచాల్సిందిగా ఆర్‌బీఐ సూచించింది. ఈ జాబితాలో తప్పకుండా ఆ డిపాజిట్‌ చేసిన ఖాతాదారుని పూర్తి పేరు, వివరాలు పొందుపరచాల్సిందిగా ఆర్‌బీఐ సలహా ఇచ్చింది. అలా చేయడం వల్ల వారి వారసులు వివరాలను తెలుసుకోవడం చాలా సులభమవుతోందని ఆర్‌బీఐ పేర్కొంది.

అన్‌క్లెయిమ్‌డ్‌ బ్యాంకు డిపాజిట్లు అత్యధికంగా ఉన్న బ్యాంకు జాబితాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. దాదాపు 47 లక్షల ఇన్‌యాక్టివ్‌ ఖాతాల్లో మొత్తం రూ.1,036కోట్ల నగదు ఉంది. 47 లక్షల ఇన్‌యాక్టివ్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.995కోట్ల నగదు ఉండి కెనరా బ్యాంకు తర్వాతి స్థానంలో ఉంది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 23లక్షల ఇన్‌యాక్టివ్‌ ఖాతాలుండగా.. అందులో రూ.829కోట్లు మూలుగుతున్నాయి. మరోవైపు ఈ డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీతో ఆ నగదు మరింత పెరుగుతూ వస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top