లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలకుమించి నమోదవడంతో స్టాక్ మార్కెట్లకు మరింత కిక్కునిచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో మదుపర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. దీంతో బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. జీడీపీ గణాంకాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో సూచీ ఇంట్రాడేలో 29 వేల మార్క్‌ను దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ 241.17 పాయింట్లు(0.84 శాతం) లాభపడి 28,984.49 పాయింట్ల వద్దకు చేరుకుంది. సెప్టెంబర్ 8 తర్వాత సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు. గడిచిన రెండు సెషన్లలో సూచీ 149.65 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 8,900 పాయింట్ల మార్క్‌ను దాటింది. చివరకు 66.20 పాయింట్ల చొప్పున లాభపడి 8,945.80 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో లిైస్టెన్ కంపెనీల నికర విలువ మరో రికార్డును చేరుకున్నది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ విలువ రూ.118 లక్షల కోట్లకు చేరింది.

ఈ ఏడాది వృద్ధి 7.1 శాతానికి చేరుకోనున్నట్లు కేంద్ర గణాంక శాఖ అంచనాను విడుదల చేయడంతో సూచీ మరింత బలపడింది. ఇమ్మిగ్రేషన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లు పుంజుకోవడానికి పరోక్షంగా కారణమైంది. అలాగే గడిచిన నెలకుగాను ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసుకోవడంతో ఈ రంగానికి చెందిన షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. టాటా స్టీల్ 3.66 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా 3.13 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.56 శాతం, ఐటీసీ 2.46 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.32 శాతం, సన్‌ఫార్మా 2.26 శాతం, హీరో మోటోకార్ప్ 1.56 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.41 శాతం, ఇన్ఫోసిస్ 1.25 శాతం, హెచ్‌యూఎల్ 1.11 శాతం, ఎస్‌బీఐ 1.02 శాతం లాభపడ్డాయి. వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్, ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ 1.93 శాతం క్షీణించి టాప్ లూజర్‌గా నిలిచింది. ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, కోల్ ఇండియా, విప్రో, మారుతి షేర్లు క్షీణించాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో 21 లాభపడగా, తొమ్మిది నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ 3.46 శాతం బలపడగా, మెటల్ 1.91 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.30 శాతం, బ్యాంకింగ రంగ సూచీ 0.96 శాతం, హెల్త్‌కేర్ 0.87 శాతం చొప్పున లాభపడ్డాయి.

క్షీణించిన రూపాయి

స్టాక్ మార్కెట్లు పుంజుకున్నప్పటికీ రూపాయికి మాత్రం మరిన్ని చిల్లులు పడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు క్షీణించి 66.82 వద్దకి పడిపోయింది. అమెరికా కరెన్సీని కొనుగోలు చేయడానికి బ్యాంకర్లు, దిగుమతిదారులు ఎగబడటంతో కరెన్సీ పతనం చెందడానికి కారణమైందని ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top