ప్రభుత్వరంగంలోని బ్యాంకులను ప్రైవేటీకరించుటకు ఇది సమయం కాదు

న్యూదిల్లీ: ప్రభుత్వరంగంలోని కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరించవచ్చని.. అయితే ఇది మాత్రం తగిన సమయం కాదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్ రజనీశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక చేయూతనిచ్చి జవసత్వాలను నింపేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో బయటపడిన కుంభకోణంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ సంక్షోభంలో ఉందనుకునే ప్రమాదముందన్నారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ముందు బలోపేతమయ్యేలా చేయడం ద్వారా మార్కెట్‌లో మంచి ధర సాధిస్తుందని చెప్పారు. ఈ చర్యలకు కనీసం రెండేళ్ల సమయం పడుతుందన్నారు. కొన్ని బ్యాంకుల ప్రైవేటీకరణకు తానేమీ వ్యతిరేకం కాదని, అయితే సరైన ప్రాతిపదికన చేయాల్సిన అవసముందని వ్యాఖ్యానించారు.

ఎస్‌బీఐ తప్ప మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించి బ్యాంకింగ్‌ వ్యవస్థను సరళీకరించాలని ఆర్థిక వేత్త అరవింద్‌ పనగరియా ఇటీవల రచించిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకులు స్వల్ప ఆదాయం కలిగిన వారితో ఖాతాలను తెరిపించడానికి బొత్తిగా ఆసక్తి చూపవని రజనీశ్‌ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను ఉపసహరించుకోవడానికి ముందు ప్రభుత్వం వాటికి కొంత సమయం ఇచ్చి బలోపేతం చేయాలని సూచించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను నవీకరించే ముందు నిర్మాణత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టాలన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top