నీలేకని రాకతో ఇన్ఫీలో జోష్!

బెంగళూరు: ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా నందన్‌ నీలేకని అడుగుపెట్టడంతో వచ్చే ఆరేళ్లలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అత్యుత్తమంగా పరుగులు తీయడం ప్రారంభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన నేతృత్వంలో కంపెనీ తన నాయకత్వ స్థిరత్వాన్ని అందుకుంటుందని, కార్పొరేట్‌ పాలనపై వివాదాలను పరిష్కరించుకుని, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో పేర్కొన్నది.

వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య కార్పొరేట్‌ పాలన విషయంలో జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో సీఈఓ విశాల్‌ సిక్కా నిష్క్రమించగా, గత వారం సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నీలేకని పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అప్పటిదాకా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన శేషశాయి, మరో ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

సంస్థను భవిష్యత్ వైపు నడిపించడానికే తాను తిరిగి వచ్చానని నీలేకని ఇన్ఫీ ఉద్యోగులకు వీడియో సందేశం పంపారు. ఇన్ఫోసిస్‌లోకి తిరిగి రావడం ఆనందంగా ఉన్నదని, కొద్ది నెలలు మాత్రమే ఉంటానా? సుదీర్ఘ కాలం ఉంటానా? ఇప్పుడే చెప్పలేనని, అయితే సంస్థను చాలా సానుకూలంగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటానన్నారు. సంస్థ ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపడానికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

కొత్త ఛైర్మన్‌ వచ్చిన నేపథ్యంలో సీఈఓ ఎంపిక వేగవంతం అవుతుందని, వ్యూహాలను తిరిగి మదిస్తారని.. ఇవి కంపెనీలకు సానుకూలతలను తెచ్చిపెడతాయని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. మరో పక్క పరిశ్రమ దిగ్గజం గణేశ్‌ నటరాజన్‌ మాట్లాడుతూ ‘ఇన్ఫోసిస్‌ ఏ ఏ చర్యలు చేపట్టాలో ఆ చర్యలను తీసుకోవాలి. బోర్డు బాధ్యతాయుతంగా ఉండాలి. యాజమాన్యానికి కావలసిన విధంగా సహకరించాలి' అని అన్నారు. ఇన్ఫోసిస్‌కు ప్రస్తుతం ఒక దీర్ఘకాల దృష్టిగల సీఈఓ అవసరం ఉందని నటరాజన్‌ అన్నారు. బోర్డుతో పాటు.. బయటి గ్రూపులను సైతం సమర్థంగా నిర్వహించే వ్యక్తి అవసరమన్నారు.

రవి వెంకటేశన్‌ను కొంత మంది వాటాదార్లు విమర్శించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ స్వతంత్ర డైరెక్టర్‌ కిరణ్‌ మజుందార్‌ షా మద్దతు పలికారు. ఆయనో విలువైన బోర్డు సభ్యుడని పేర్కొన్నారు. ‘వెంకటేశన్‌ను రాజీనామా చేయాలని కోరడం భావ్యం కాదు. నందన్‌ నీలేకని కూడా వెంకటేశన్‌ను ఒక విలువైన బోర్డు సభ్యుడిగానే భావిస్తున్నారు. ఎలాంటి విశ్వసనీయమైన సమాచారం లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాద'ని అన్నారు. కొత్త సీఈవో కోసం వెతుకుతున్న ఇన్ఫోసిస్.. గతంలో సంస్థలో కీలక పదవులు పోషించిన వారిపైనా దృష్టిసారించింది. సంస్థతోపాటు, గతంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసిన వారిలోనూ సీఈవో పదవి కోసం సమర్థుడైన వ్యక్తిని అన్వేషించనున్నట్లు నీలేకని ఇన్వెస్టర్లకు తెలిపారు. సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ప్రమాణాలు) పటిష్ఠపర్చడంతోపాటు స్థిరత్వం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు, బోర్డుకు, నారాయణమూర్తికు మధ్య సత్సంబంధాలు కొనసాగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కంపెనీ ప్రకటించిన రూ.13,000 కోట్ల షేర్ల తిరిగి కొనుగోలు(బైబ్యాక్‌) పథకంపై ప్రమోటర్లు ఆసక్తి వెలిబుచ్చినట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ప్రతిపాదిత బైబ్యాక్‌లో పాల్గొనన్నుట్లు ప్రమోటర్ల నుంచి సమాచారం అందిందని ఇన్ఫీ వివరించింది. ఎవరెవరు ఎంత మేర బైబ్యాక్‌ చేస్తున్నారన్న వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి సహా ప్రమోటర్లకు 12.75 శాతం వాటా ఉంది. బోర్డులో సంక్షోభంతో మార్కెట్‌ క్యాప్‌ను భారీగా నష్టపోయిన సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ సోమవారం మార్కెట్లో లాభాలతో దూసుకుపోతోంది. ఇటీవలి పరిణామాలకు చెక్‌ పెడుతూ కొత్త ఛైర్మన్‌గా నందన్‌నీలేకని రంగంలోకి దిగడంతో ఈ షేర్‌కు బూస్ట్‌ లభించింది.

ముఖ్యంగా ఇన్ఫోసిస్‌లో స్థిరత్వానికి ఛైర‍్మన్‌ నందన్‌నీలేకని హామీ ఇవ్వడంతో ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో లాంగ్‌ వీకెండ్‌ తరువాత మొదలైన మార్కెట్లలో భారీ కొనుగోళ్లతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.3 శాతానికి పైగా లాభపడి 944 వద్ద కొనసాగుతోంది. ఒకప్పటి చైర్మన్‌, సహవ్యవస్థాపకులు నందన్‌ నీలేకని తాజాగా తిరిగి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవిని చేపట్టిన వెంటనే ఇన్వెస్టర్లతో, వాటాదారులతో సమావేశం నిర్వహించి, భద్రతకు, స్థిరత్వానికి హామీ ఇచ్చారు. అంతేకాదు తన పదవీ కాలం ఎన్నాళ్లు ఉంటుందనేది బోర్డు తనకు చెప్పలేదనీ, కానీ కంపెనీ కార్యకలాపాల్లో స్థిరత్వాన్ని తెచ్చేవరకూ చైర్మన్‌ పదవిలో కొనసాగనున్నట్లు నీలేకని హామీ ఇవ్వడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రూ.13,000 కోట్లతో సొంత షేర్ల కొనుగోలు (బైబ్యాక్‌) ఆఫర్‌ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.

ఇన్ఫోసిస్‌కు చైర్మన్‌గా నియమితులైన నందన్ నీలేకని.. కనీసం 2-3 ఏండ్లపాటైనా ఈ పదవిలో కొనసాగాలని సంస్థ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ (బాల) అభిప్రాయపడ్డారు. ప్రమోటర్ల ప్రమేయం లేకుండా బయటి వ్యక్తుల సారథ్యంలో సంస్థను అభివృద్ధి పథంలో నడిపించాలన్న ప్రయత్నాలు మరోసారి విఫలం కాకుండా నీలేకని చాలా జాగురూకతతో తన వారసుడిని ఎంపిక చేసుకోవాలన్నారు. సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు దిగజారాయని సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తితోపాటు బహిరంగంగా విమర్శలు చేసినవారిలో బాలకృష్ణన్ ఒకరు. తాజాగా ఆయన మరో డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.

నీలేకని రీఎంట్రీ నేపథ్యంలో సంస్థ సహ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రవి వెంకటేశన్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పదవి నుంచి సైతం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఫోసిస్ బోర్డును నైపుణ్యంతో నడుపాలని 2014లో చాలా పెద్ద ప్రయోగం చేశారు. తొలిసారిగా కంపెనీ వ్యవస్థాకుల స్థానంలో విశాల్ సిక్కాకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టారు. కానీ బోర్డు సరిగ్గా సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఆ ప్రయోగం విఫలమైందని బాల అన్నారు. సీఈవో లేదా బోర్డు సభ్యుడిగా మళ్లీ ఇన్ఫోసిస్‌లో చేరే ఉద్దేశమేమైనా ఉందా అన్న ప్రశ్నకు బాలకృష్ణన్.. లేదు అని సమాధానం ఇచ్చారు. లేదు. మూడేండ్ల క్రితమే నేనే కంపెనీ నుంచి బయటికొచ్చాను. ప్రస్తుతం ఓ వెంచర్ ఫండ్‌ను నడుపుతున్నాను. నాకు ఆసక్తి లేదు. పూర్వ ఉద్యోగుల్లో అశోక్ వేమూరి, బీజీ శ్రీనివాస్, మోహన్ ఇలా చాలా మంది సమర్థులున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top