లగ్జరీ కార్ల ధరలకు మళ్లీ రెక్కలు!

న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో భారీగా తగ్గిన లగ్జరీ కార్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. మధ్యస్థాయి, భారీ, లగ్జరీ కార్లతోపాటు హైబ్రిడ్ మోడళ్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై (ఎస్‌యూవీ) గరిష్ఠ సెస్సు పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన ఫలితంగా బడా కార్ల ధరలు రూ.3 లక్షల వరకు తగ్గాయి. అయితే, కొత్త పరోక్ష పన్నుల విధానంలో సాధారణ వస్తువుల రేట్లు మాత్రం గతంలో కంటే పెరిగాయి. ఈ వైపరీత్యాన్ని చక్కదిద్దేందుకే పెద్ద కార్లపై సెస్సు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. బుధవారం క్యాబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. గరిష్ఠ సెస్సు పరిమితిని పెంచేందుకు ఆర్డినెన్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జీఎస్టీ (రాష్ర్టాలకు నష్టపరిహారం) చట్టం-2017లో తగిన సవరణ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఏ విభాగ కారుపై ఎంత సెస్సు విధించాలి, పెంపును ఎప్పటినుంచి అమలు చేయాలనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని జైట్లీ తెలిపారు. ఈనెల 9న హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది.

పార్లమెంట్ సమావేశాలు జరుగని సమయాల్లో చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, ఆ చట్ట సవరణపై ఆరు నెలల్లో పార్లమెంట్ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. తదుపరి పార్లమెంట్ సమావేశాలు నవంబర్ లేదా డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. విలాస వస్తువుల ధరలు తగ్గి, నిత్యావసరాలు ప్రియం కావడం జీఎస్టీ ఉద్దేశం కారాదని జైట్లీ అన్నారు. ఒకవేళ పన్నుల ఊరట ఇస్తే సాధారణ ప్రజలకివ్వాలి గానీ లగ్జరీ ఉత్పత్తులపైన కాదు. రూ. కోటితో కారు కొనగలిగే వ్యక్తి రూ.1.20 కోట్లు వెచ్చించైనా ఆ వాహనాన్ని దక్కించుకోగలడు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డజనుకుపైగా పరోక్ష పన్నులన్నింటి స్థానంలో కేంద్రం జీఎస్టీని ప్రవేశపెట్టింది. కొత్త పరోక్ష పన్నుల విధానంలో కార్లపై 28 జీఎస్టీతోపాటు మోడల్‌ను బట్టి 1 నుంచి 15 శాతం సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సెస్సు వసూలు ద్వారా పోగైన నిధులను కార్పస్ ఫండ్‌గా ఏర్పాటు చేసి జీఎస్టీ అమలు కారణంగా నష్టపోతున్న రాష్ర్టాలకు కేంద్రం పరిహారం చెల్లించనుంది. జీఎస్టీ అమలుతో కార్లపై మొత్తం పన్ను భారం గత విధానంలో కంటే తగ్గింది.

ప్రస్తుతం భారీ స్థాయి వాహనాలు, ఎస్‌యూవీలు, మిడ్, లార్జ్, హైబ్రిడ్ కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు 15 శాతం సెస్సు విధిస్తున్నారు. 4 మీటర్లు, 1,200 సీసీలోపు ఇంజిన్ సామర్థ్యం కలిగిన చిన్న పెట్రోల్ కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు ఒక శాతం సెస్సు వర్తిస్తుంది. ఇక 4 మీటర్లు, 1,500 సీసీ లోపు ఇంజిన్ కెపాసిటీ కలిగిన డీజిల్ కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు 3 శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15 శాతం సెస్సు వర్తించే కార్లపై పన్ను భారం మరో పది శాతం పెరుగనుందని ఓ అధికారి తెలిపారు. సెస్సును 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు వీలుగా జీఎస్టీ చట్టంలో సవరణ చేయాలని ఈనెల 5న జరిగిన సమావేశంలో జీఎస్టీ మండలి కేంద్రానికి ప్రతిపాదించింది. వాహనాల్లో మొత్తం 12 రకాల విభాగాలున్నాయని, అందులో కేవలం 2 క్యాటగిరీలపైనే సెస్సు పెంపు ప్రభావం ఉండనుందని జైట్లీ అన్నారు. కార్ల విభాగాల్లో మార్పు లేదని, కేవలం లగ్జరీ క్యాటగిరీ తప్ప మరే ఇతర కార్లపై పన్ను భారం పెంచే ఉద్దేశం లేదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అన్నారు.

లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిపై ప్రభావం: ఆటో ఇండస్ట్రీ

సెస్సు పెంపు నిర్ణయం భారత్‌లో లగ్జరీ, ఎస్‌యూవీ కార్ల విభాగ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుందని మెర్సిడెజ్ బెంజ్, ఆడీ, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్)తోపాటు పలు ఆటో సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సెస్సు పెంపు విషయంలో ప్రభుత్వం తొందపడుతున్నదని విమర్శించిన సంస్థలు.. జీఎస్టీ ప్రభావంపై ఆరు నెలల్లో స్పష్టత వస్తుందని, అప్పుడు పన్నులను పునః సమీక్షించాల్సిందని అభిప్రాయపడ్డాయి. కేంద్రం నిర్ణయంతో దేశీయ మార్కెట్లో లగ్జరీ కార్ల వృద్ధిపై తీవ్ర ప్రభావం పడనుందని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రోలాండ్ ఫోల్గర్ అన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top